Thursday, September 24, 2009

నాటు వైద్యమా? నేటి వైద్యమా?

బ్లాగ్: కృష్ణాజిల్లా చల్లపల్లిలోని ప్రముఖ వైద్యులు డా. డి.ఆర్.కె.ప్రసాద్ కాముకాటుకు నేటివైద్యమే సత్ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఆయన ప్రజలకు శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు విశేషరీతిలో కృషిసల్పారు. 1989 నుంచి నేటివరకూ రెండు దశాబ్దాలుగా పాముకాటు వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్న నిరంతర శ్రామికుడాయన. కరపత్రాలు, పుస్తకాల ద్వారా ప్రజలను కొంతమేర చైతన్యవంతులను చేశారు. విద్యార్థులకు లాప్ టాప్ కంప్యూటర్ల ద్వారా ఎన్నో అవగాహనా సదస్సులను నిర్వహించిన ఆయన ఈ క్రమంలో కొంతమేర కృతకృత్యులయ్యారు. పాముకాటు కారణంగా అత్యంత విలువైన జీవితాన్ని మనిషి కోల్పోరాదనే ఉద్దేశంతో విలువైన కాలాన్ని సైతం లెక్కచేయక పాముకాటుకు నాటు వైద్యమా... నేటి వైద్యమా అని అనుభవాలనూ, గుణపాఠాలనూ తాను రచించిన పుస్తకం ద్వారా ప్రజలకు తెలియచెప్పిన ప్రముఖ వైద్యులు .ప్రసాద్. ప్రతి జబ్బు వైద్యానికీ ప్రొటోకాల్ ఉన్నట్లుగానే పాముకాటు వైద్యానికి ప్రొటోకాల్ ను తయారుచేయటంలో డి.ఆర్.కె ప్రముఖ పాత్ర పోషించారు. పాముకాటుకు గురైనవారిలో అధికశాతం మందిని ప్రాణాలతో బతికించవచ్చనీ, పాముకాటుపై ప్రజలకు అవగాహన తప్పనిసరనీ పేర్కొనే డా.డి.ఆర్.కె.ప్రసాద్ పాముల్లో రకాలు, కాటు ప్రభావం, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సవివరంగా వివరించారు.
పాముల్లో రకాలు - విషసర్పాలు...
ప్రపంచంలో మూడువేల రకాల పాములుండగా, వాటిలో 250 రకాలు విషసర్పాలు ఉన్నాయి. మనదేశంలో తాచుపాము, కట్లపాము, రక్తపింజర, సాస్కేల్డ్ వైపర్ (పుర్సా), హంప్ నోసెడ్ పిట్ వైపర్ ఐదురకాలే విషపూరితమైనవి. పాముకాటుల్లో సుమారు 30 నుంచీ 50 శాతం సరిగ్గా విషమెక్కని ఉత్తుత్తి కాటులే. విషపుపాము కరిచిన రోగినైనా అరగంట నుంచి గంటలోపు ఆసుపత్రికి తీసుకువెళ్తే నూటికి 90 మందిని బతికించవచ్చు. పాముకాటు వల్ల శరీరంలోకి విషం ఎక్కితే యాంటీ స్నేక్ వీనమ్ తో తప్ప మరేవైద్యం వల్లా బతికే అవకాశం లేదు.
పాముకరిచిన సమయంలో విషలక్షణాలు...
త్రాచు, కట్లపాముల్లోని విషం న్యూరోటాక్సిన్ ఎక్కితే కళ్ళు మూతలుబడతాయి. గుండె బరువుగా అనిపిస్తుంది. వాంతికాబోతున్నట్లుగా అనిపించి వాంతి అవుతుంది. ఒక్క మనిషే ఇద్దరుగా కనిపించటం, కాళ్ళు, చేతులు కొట్టుకోవటం, శ్వాసకండరాలు పనిచేయక ఊపిరాగిపోవటం, గుండెకొట్టుకోవడం ఆగి, కొద్ది నిముషాల్లో మెదడు పనిచేయకపోవటం జరుగుతుంది. రక్తపింజర విషం ఎక్కితే శరీరభాగం వాయటంతోపాటు గజ్జల్లో, చంకల్లో బిళ్ళలు కట్టి భరించరాని నొప్పి వస్తుంది. శరీరంలోని ఏ భాగంలో నుంచైనా రక్తస్రావం జరుగుతుంది.
పాముకరిస్తే చేయాల్సిన పనులు...
కరిచింది ఏ పామో వీలైతే గుర్తించాలి, రోగికి ధైర్యం చెప్పాలి. పాము విషానికి విరుగుడు ఇంజక్షన్లు ఉన్నాయనీ, ప్రమాదం నుంచి బయటపడతామనే ధీమాను రోగికి కల్పించాలి. కరిచిన చోటుకు పైభాగంలో గుడ్డముక్కతో సుమారుగా బిగించికట్టాలి. రోగిని నడిపించకుండా సైకిల్, స్కూటర్ లపై సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. నోటిద్వారా ఎటువంటి ఆహారాన్ని ఇవ్వరాదు. నాట్లు, పసరు, మంత్రాలతో కాలయాపన చేయరాదు. కంట్లో కలికం, నోట్లో పసరు పోయటం ద్వారా విష ప్రభావం తెలుసుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
డాక్టర్ చేయాల్సిన వైద్యం...
రోగికి ధైర్యం నూరిపోస్తూ చికిత్స ప్రారంభించాలి. ఆహారమేమీ ఇవ్వకుండా సెలైన్ ఎక్కించాలి. ధనుర్వాతం రాకుండా ముందు జాగ్రత్తగా టెట్వాక్ ఇంజక్షన్ ఇవ్వాలి. రోగిని పరిశీలిస్తూ విష ప్రభావం కనిపించినపుడు ఏ ఎస్ వీ ఇంజక్షన్లు చేయాలి. విష లక్షణాలు కనిపించకపోతే 24 గంటల తర్వాత రోగిని పంపించివేయచ్చు. త్రాచు, కట్లపాము కాట్లతో శ్వాస ఆగినప్పుడు రోగికి యాంబుబ్యాగ్ తో కృత్రిమ శ్వాస ఏర్పాటు చేయాలి. పాము కాటుకు ఎక్కువ సందర్భాల్లో 5 నుంచీ 10 వరకు యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుంది. వీటికి దాదాపు నాలుగువేల రూపాయలు ఖర్చవుతాయి. పాముకాటుకు గురయ్యేవారిలో అధికభాగం కూలీలే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఏ ఎస్ విలు ఉంచాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment