Thursday, September 24, 2009

చిన్నపార్టీలకు దెబ్బ


బ్లాగ్: జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు రాష్ట్రంలోని చిన్న, చితక పార్టీలన్నిటినీ ఘోరంగా దెబ్బ తీశాయి. ఎప్పటిలాగానే రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాత్రమే ముఖాముఖి పోటికి తలపడిన సత్తా ఉన్న పార్టీలుగా మనగలిగే పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ, ప్రాంతీయంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కోలుకోలేనంత దెబ్బతిన్నట్టు ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ ప్రభంజనాన్ని కొద్దో గొప్పో అయినా ఎదుర్కోగలిగిన స్థాయి ఆ పార్టీకి మిగిలి ఉందని రుజువైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టిడిపి తన బలాన్ని రెట్టింపు చేసుకోగలిగింది. ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌ కాస్త గౌరవప్రదమైన సీట్లనైనా గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వందరోజులు దాటి కొద్ది రోజులైనా గడవక ముందే ఆ పార్టీలు తమ అభ్యర్ధులను గెలిపించుకోవటంలో దారుణంగా విఫలమయ్యాయి. వైఎస్ మరణం, ఇతర అంశాలు, స్థానిక సమీకరణల ఫలితంగా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పుకుంటూ ఆయా పార్టీలు కాలం గడిపినప్పటికీ, జనామోదం పొందగలిగిన బలాన్ని కూడగట్టటంలో విఫలమయ్యాయన్న విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. ఈసారి 19 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 15 కాంగ్రెస్ కు రాగా, టిడిపికి 4 స్థానాలు దక్కించుకున్నాయి. అలాగే 17 ఎంపీటీసీలలో కాంగ్రెస్ 12, టిడిపి 2, ఇతరులు 3 స్థానాలు గెలుచుకొన్నారు. మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో 20 స్థానాలకు కాంగ్రెస్ 8, టిడిపి 8, సిపిఐ, ఇండిపెండెంట్ చెరో స్థానం, పీఆర్పీ 1 స్థానం గెలుచుకొన్నాయి. ఉద్యమ పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెబుతున్న టిఆర్‌ఎస్‌ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నది. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్ తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారకరామారావు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన ఎల్లారెడ్డి జడ్పీటీసీ కాంగ్రెస్ వశమైంది. సార్వత్రిక ఎన్నికల్లోనే కాక, ఈ ఎన్నికల్లో చూసినా చిన్న పార్టీల పరిమితి కేవలం ప్రధాన పక్షాల అభ్యర్ధుల గెలుపు ఓటములను తారుమారు చేసేవరకే అని తేలిపోయింది.
సార్వత్రిక ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు, 18 సీట్లు గెలుచుకున్నామని పీఆర్పీ అధినేత చిరంజీవి అవకాశం చిక్కినప్పుడల్లా ఘనంగా చెప్పుకుంటారు. క్రమంగా ఆ పరిస్థితి మారిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు జరిగితే స్థానికంగా పట్టు ఉన్న వారికి మాత్రమే అవకాశం చిక్కుతుంది. అలాంటివారు పీఆర్పీలో కనిపించారు.ఇక టిఆర్‌ఎస్‌ పరిస్థితి దయనీయంగా మారింది. గులాబీ కండువా కప్పుకుని తిరిగేందుకు తప్ప ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగిన నాయకులంటూ కనిపించరు. అటు జిల్లాల్లోనూ, ఇటు గ్రేటర్ పరిధిలోనూ అదే పరిస్థితి. ఈసారి గ్రేటర్ లో అన్ని డివిజన్లకూ పోటీ చేస్తామంటున్నా, అది నెరవేరేట్లు కనపడటంలేదు. అంతో ఇంతో బలం ఉన్న పీఆర్పీ, టిఆర్‌ఎస్‌ లాంటి పార్టీలే ఉనికి కోసం పాకులాడే దుస్థితిలో పడిపోయిన నేపథ్యంలో నిష్కళంకమైన రాజకీయాల నినాదంతో రాజకీయ ప్రవేశం చేసిన లోక్‌సత్తా పార్టీ మరీ గందరగోళంగా ఉంది. ఇటీవలి టెక్కలి శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆ పార్టీ పట్టుమని 1500 ఓట్లు సాధించలేకపోయింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆకర్ష, స్వగృహ ప్రయోగాలకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ చిన్నా, చితకా పార్టీల పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించటంలేదు.

0 comments:

Post a Comment