Tuesday, November 17, 2009

హైదరాబాద్ ఎక్ష్ప్రెస్స్

మహా నగరమా, మరో నరకమా?: దేశ, విదేశాల్లో హైదరాబాద్ మహానగరం గురించి గొప్పగా చెప్పుకుంటారు. కాని నగరం నరకప్రాయం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే నగరం సమస్యల గనిగా మారింది. అయిదేళ్లుగా నగరానికి చేసింది లేకపోగా, తమ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెబుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు చేజిక్కించుకోవాలని చూస్తున్నది ప్రభుత్వం అయిదారేళ్ళుగా నగరం, దాని చుట్టు పక్కల చట్టాలతో దడికట్టారు. అడుగడుగునా రాజకీయ ప్రమేయంతో కనపడిన ఖాళీ స్థలాలను ఆక్రమించమే పనిగా, రౌడీలు గుండాల రాజ్యంగా, మాఫీయాలకు నిలయంగా, ఉగ్రవాదులకు అడ్డాగా నగరాన్ని నిలిపారు. గత ఐదేళ్ళు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, పరిపాలనా సూత్రాలకు భిన్నంగా సాగిన సామాజిక విధ్వంసానికి అంతులేదు. నగరం పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. మహానగర నీటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ముందు చూపులేకుండా వండివార్చింది. 'గ్రేటర్'ను ఏర్పాటు చేసి మునిసిపాలిటీలను విలీనం చేశారు. దాంతో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నగరంలోని అన్ని ప్రాంతాలకూ మంచినీటిని రోజూ సరఫరా చేస్తామని రాష్ట్రసర్కారు హడావుడిగా ప్రకటించింది. కానీ, ఆచరణలో అది దారుణంగా విఫలమైంది. నగరంలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే-రోజూ కచ్చితంగా మంచి నీటిసరఫరా జరుగుతున్న ప్రాంతాలు లేవనే చెప్పాలి. అవసరాలకు తగిన మేర సౌకర్యాలను కల్పించగల శక్తి లేకపోయినప్పటికీ, ఎన్నికల ఉద్దేశంతో రోజూ మంచినీళ్ల పేరిట ప్రభుత్వం చేసిన ప్రకటన- నీటి సరఫరా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణమైంది. రక్షితనీటిని అందించేందుకు కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నట్లు పాలకులు ప్రకటనలు చేస్తున్నారుగానీ, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంచుమించు 70 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ లో ఏళ్లనాటి తాగునీటి సరఫరా వ్యవస్థ కారణంగా 30 శాతం నీరు వృధాగా పోతోంది. హైదరాబాద్ లో కనీసం 150 మురికివాడల్లో నీటి కాలుష్యం దారుణంగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇప్పటికీ నిజాం కాలంనాటి వ్యవస్థనే కొనసాగిస్తూ నగరవాసులకు సర్కారు నిత్యం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది.
నగరానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్నా ప్రజారవాణాపై ఇప్పటికీ ఒక వ్యూహంగానీ, ప్రణాళికగానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పర్యవసానంగా ట్రాఫిక్ సమస్య ఊహకందనంత అధ్వానంగా మారుతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత చిక్కుముడిగా మారుతోంది. ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ విషయంలో సాగుతున్న జాప్యం నగర ప్రజలపై ప్రతికూల ప్రభావం కనబరుస్తోంది. గంటపాడు గట్టి వర్షం కురిస్తే నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధం అవుతాయి. నాలాలు ఏ క్షణాన మూసుకుపోతాయో, మ్యాన్ హోళ్లు రాక్షసంగా ఎప్పుడు నోళ్లు తెరుస్తాయో తెలియక జనం బెంబేలెత్తుతున్నారు. కాల్వలను లోపరహితంగా తీర్చిదిద్దకపోవడం, నాలాలను విస్తరించకపోవడం ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. వరద ముప్పునుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం రూ.30 కోట్ల వరకు వెచ్చించింది. తీరా, గ్రేటర్ అంతటికీ అది ఆచరణ సాధ్యం కాదని పక్కన పెట్టేశారు. తాజాగా నాలుగువేల కోట్ల రూపాయలతో మరో ప్రణాళికను రూపొందించారు. ఇలా ఏటా ప్రణాళికలతో పొద్దుపుచ్చడమే తప్ప వరద ముప్పు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న జాడలే లేవు. ఓటు మాటలు తప్ప అభివృద్ధి పట్టని పాలకుల నేతృత్వంలో నగరం అంతకంతకూ సమస్యల వలయంలో కూరుకుపోతోంది. పైపై మెరుగులకు ప్రాధాన్యమిచ్చి ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నందువల్లే నగర జీవనం.. నరకానికి నకలుగా మారింది. సమస్యలు పెరుగుతున్నా ఇప్పటివరకూ ప్రత్యామ్నాయాలపైన, పరిష్కార మార్గాలపైన దృష్టిసారించని నాయకులు- ఓట్లకోసం ఇప్పుడు హైదరాబాద్ గల్లీగల్లీలో తిరుగుతున్నారు. మాయవలలు విసురుతున్నారు.

1 comment:

  1. This is a wonderful article, Given so much info in it, These type of articles keeps the users interest in the website,
    and keep on sharing more ... good luck!

    ReplyDelete