Saturday, January 24, 2009

ముసలితనం

లక్షణాలు:





పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు. సమాజంలో సమష్టి భావన నానాటికీ తగ్గి, మనిషి ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే పోతాడనే "వేదాంత" ధోరణి పెరగడంతో ప్రజల సామాజిక దృక్పథం కొంతవరకూ మార్పుచెంది తీరుతుంది. ఇది చాదస్తమనేది మనకు తెలుసు. అలాంటప్పుడు శాస్త్రవిజ్ఞానపరంగా మనకు ముసలితనం, చావు వగైరాల గురించిన వివరణ ఎటువంటిదో కొంతవరకైనా తెలుసుకోవడం లాభిస్తుంది.
వేదాంతుల మాట ఎలా ఉన్నా కాలంతోపాటు మన శరీరాల్లో కలిగే మార్పుల గురించిన పూర్తి అవగాహన ఈనాటికీ లేదనే చెప్పాలి. అయినప్పటికీ సైన్స్‌ దీన్ని గురించి చాలా విషయాలు వివరించగలదు. వయసుమళ్ళిన మానవశరీరాలు ఎలాంటి మార్పులు చెందుతాయో, జీవకణాల్లో ఎటువంటి పరిణామాలు కలుగుతాయో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఆధునిక శాస్త్ర పరిశోధనల ద్వారా తెలియవస్తోంది.
పుట్టిన ప్రతి మనిషీ మామూలుగా కొంతకాలానికి ముసలివాడై చనిపోతాడు. ముందుగా ముసలితనపు లక్షణాలేమిటో చూద్దాం. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. గాయాలు త్వరగా మానవు. యవ్వనంలో లాగా జీవకణాల పునరుత్పత్తి జరగదు. శాస్త్రవేత్తలు వీటికిగల భౌతిక కారణాలకై ప్రతి జీవకణం కేంద్రకంలోనూ ఉన్న జన్యువుల్లో వెతకడం ఆరంభించారు. ఈ డిటెక్టివ్‌ పని ఇంకా కొనసాగుతూనే ఉన్నా కొన్ని విశేషాలు కాస్తకాస్తగా బైటపడుతున్నాయి. ఏడుగురు గుడ్డివాళ్ళూ, ఏనుగూ చందంగా రకరకాల కోణాలనుంచి ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. కేవలం కారణాలు తెలుసుకోవడంకాక చికిత్సకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆరోగ్యంగా ఉందామని ఎంత ప్రయత్నించినా, వయసుతో మన శరీరాలు కాస్తకాస్తగా శిథిలమవుతూ కొన్నాళ్ళకి నశిస్తాయనేది మనకి తెలిసి, మనని బాధించే సత్యం. ఇది ప్రాణుల ప్రాథమిక లక్షణంలాగా కనబడుతుంది. ఎందుకంటే 50కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన ప్రాణుల్లో కూడా ఇలాగే జరిగిందని శిలాజాల పరిశోధనల్లో తేలింది.
మొదట్లో ముసలితనంవల్ల పటుత్వం తగ్గడం అనేది వాడకంవల్ల కత్తులూ, కటార్లూ మొక్కపోవడం వంటిదనే అనుకునేవారు. కాని పంతొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో ఉష్ణగతి శాస్త్రం (thermodynamics) సూత్రాల ప్రతిపాదన జరిగాక ఈ భావన సడలింది. అందులోని రెండో సూత్రాన్నిబట్టి చూస్తే శిథిలంకావడం, తుప్పుపట్టడంవంటివి నిర్జీవపదార్థాల్లోనూ, వ్యవస్థల్లోనూ జరుగుతాయి కాని, ఆహారం తిని, పెరిగే జీవజాలంలో జరగవని తేలింది.
మన శరీరాల్లో జరిగే దీర్ఘకాలిక, తక్షణ పరిణామాలన్నిటినీ జీవకణాల స్థాయిలో అర్థం చేసుకోవడం మొదలయింది. జీవరాశి మొదట ఏకకణజీవుల రూపంలోనే ప్రారంభమైందనేది తెలిసినదే. అనేక ఏకకణజీవాలు ఒక తుట్టెలాగా ఏర్పడి మనుగడ సాగించడంలో ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు చేపట్టడంతో అవి ఒకే పెద్ద బహుకణజీవికి వేరువేరు అవయవాలుగా రూపొంది ఉంటాయి. ఆ విధంగా మొదలైన బహుకణ జీవులు ప్రాచుర్యం చెంది అనేక రూపాలను సంతరించుకున్నాయి. అయినా వాటి శరీరాల్లోని వివిధ కణసముదాయాల మధ్య మంచి సమన్వయం ఉండడం చాలా అవసరం. ఒక వ్యవస్థలో తలెత్తే లోపాలు తక్కినవాటి మీద తీవ్రమైన ప్రభావం కలిగించగలవు. వ్యవస్థకు తగిలిన దెబ్బ మరీ పెద్దదయితే ప్రాణి చచ్చిపోతుంది.
స్థూలంగా చెప్పాలంటే అనియత (random) క్రమంలో ఉండే కణాలన్నీ ప్రాణుల శరీరాల్లో చేరగానే "సజావుగా" అమరి తమ పనులను "సక్రమంగా" నిర్వర్తిస్తాయి. అంతేకాదు. అవసరమైనప్పుడు విరిగిన ఎముకలు అతుక్కోవడం వగైరా చర్యలద్వారా తప్పులు సరిదిద్దుకుంటాయి కూడా. మళ్ళీ ఇందులోనూ అన్ని జంతువులూ ఒకటిగా లేవు. క్షీరదాల్లో ఇలాంటివాటికి పరిమితులుంటాయి. ఉదాహరణకు మన వేలి చర్మం గాటుపడితే బాగవుతుంది కాని, వేలే తెగిపోతే మరొకటి మొలవదు. కొన్ని జలచరాల్లో మాత్రం తెగిన పొడుగాటి స్పర్శకాలు (tentacles) మళ్ళీ పెరుగుతాయి. దీని వల్ల తేలుతున్నదేమిటంటే ప్రాణుల శరీరాల్లో సమయానికి తగిన పరిరక్షకచర్య తీసుకునే సంక్లిష్ట వ్యవస్థ ఉన్నప్పటికీ ఎల్లకాలం ఉండే యవ్వనానికీ, చావును తప్పించుకునేందుకూ ఏర్పాట్లు మాత్రం కనబడవు.
మనిషిలాగే జంతువులన్నీ ముసలివౌతాయి. కుక్కలూ, పిల్లుల సగటు ఆయుర్దాయం మనకన్నా తక్కువ. అలాగే ఏనుగు, తాబేలువంటివి మనకన్నా ఎక్కువ కాలం బతకవచ్చు. మరొక విశేషమేమంటే ముసలితనం అన్ని ప్రాణుల్లోనూ ఒకే వేగంతో ముంచుకురాదు. ముసలితనానికీ తినే తిండికీ కూడా సంబంధముంది. కొన్ని ప్రయోగాల్లో సగం పస్తులుంచిన ఎలుకలు ఎక్కువ కాలం బతికాయి. మొక్కల రెమ్మలు కత్తిరిస్తూ ఉంటే బాగా పెరుగుతాయని మనకు తెలుసు. మనుషుల్లో కూడా శరీరాన్ని వ్యాయామంద్వారానో, ఉపవాసాలద్వారానో "శ్రమ" పెట్టినప్పుడల్లా జీవితకాలం పొడిగించబడుతోందని రుజువయింది. అంటే దీనర్థం "సుఖజీవనం" సాగిస్తున్న శరీరం తప్పనిసరిగా ముసలితనం, చావు అనే ప్రకృతి నియమాలకు లొంగిపోతుందనా? ఆహారంలో "కేలరీలు" తగ్గించి, విటమిన్లూ, ఖనిజలవణాలూ ఎక్కువగా తిన్న జంతువులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతున్నాయి.
పరిణామవాదాన్నిబట్టి చూస్తే తిండికి లేమి కలిగిన ప్రతికూల పరిస్థితిలో జాతి అంతరించిపోకుండా ఉండేందుకు ప్రాణుల శరీరాలు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మన శరీరాల్లో దాదాపు అన్ని అంశాలనూ శాసించేవి జన్యువులే (జీన్స్‌). మన ఆరోగ్యాన్నీ, ఆయుర్దాయాన్నీ శాసించేవి మన శరీర కణాల్లో అతిసూక్ష్మ స్థాయిలో జరిగే మార్పులేనని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి వేదాంతులైనా తమకు రోగం వచ్చినప్పుడు నిర్లిప్తంగా ఉండలేరు. సమస్యలను అర్థం చేసుకున్న శాస్త్రవిజ్ఞానం ద్వారా తగిన చికిత్సను పొందగలిగితే వారు మరికొన్నాళ్ళు బతికి, తమ వేదాంతాన్ని మరింత వల్లె వేయగలుగుతారు! రోగచికిత్స కూడా లాభాలు గడించే వ్యాపారంగా మారుతోందనేది నిజమైనా శాస్త్ర పరిశోధనలవల్ల ప్రజలకు కొంతయినా మేలు జరుగుతోందనడంలో మాత్రం సందేహం లేదు.


ఎందుకొస్తుంది?






ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి? ప్రారబ్ధం, పూర్వజన్మఫలం మొదలైన చాదస్తాలను పక్కనపెడితే ప్రకృతిలో ఇటువంటిది ఎందుకు జరుగుతుందో ఆలోచించవచ్చు. దీన్ని గురించిన వైజ్ఞానిక ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. వీటిలో ఒకటి తరతరానికీ సంతతిలోని జన్యువుల్లో యాదృచ్ఛికంగా కలిగే మార్పులకు సంబంధించినది. ఇటువంటి మ్యుటేషన్ల వల్ల కొత్త తరం ప్రాణుల్లో కొన్ని కొత్త లక్షణాలతో పుట్టవచ్చు. అయితే వీటిలో బతికేవి పరిసరాల్లో భౌతికంగానూ, భౌగోళికంగానూ అప్పుడప్పుడూ కలిగే మార్పులకు అనుగుణంగా ఉన్న ప్రాణులే. కొన్ని శరీరలక్షణాలు కలిగిన ప్రాణి మరీ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైతే చచ్చిపోతుంది. దానికి పుట్టిన సంతానంలో ఏ ఒక్కదానికైనా అటువంటి పరిస్థితులకు తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు ఉన్నట్టయితే కనీసం అదైనా బతుకుతుంది.
ఈ లెక్కన ముసలితనం అనేది ప్రాణి శరీరానికి పటుత్వం తప్పి, అంత్యదశకు చేరబోయే ముందు దశ. మనుషుల విషయంలో పెరిగే వయస్సును గురించిన అనేక భావావేశాలూ, ఉద్వేగాలూ కలగడం మామూలే కాని తక్కిన ప్రాణుల విషయంలో అటువంటి 'భేషజా'లేవీ కనబడవు. అందుచేత ఈ వ్యాసానికి సంబంధించినంతవరకూ అలాంటి భావనలనూ, అనుభూతులనూ గురించిన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టాలి.
ప్రాణుల్లోని మూల జీవపదార్థం డీఎన్‌ఏ. ఇక్కడ ముఖ్యవిషయం ఏమిటంటే ప్రాణి బతికున్నన్నాళ్ళూ జీవకణాలలో ఉండే డీఎన్‌ఏ తన మనుగడను కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సంతానోత్పత్తి జరిగినప్పుడల్లా అది కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రకృతికి సంబంధించినంత వరకూ ఆ పదార్థం తల్లీ పిల్లల్లో దేని శరీరంలో ఉన్నా ఫరవాలేదు. పైగా ఒక ప్రాణి శరీరం యాంత్రికంగా కొన్ని సంవత్సరాలకు మించి "నడవదు". దాన్ని రిపేరు చేసుకుంటూ, ఎల్లకాలం నడపడంకన్నా దాని స్థానంలో అదే జన్యుపదార్థం కలిగిన మరొక ప్రాణిని పెంచి పెద్దచెయ్యడం ప్రకృతికి తక్కువ "ఖర్చు"తో కూడిన వ్యవహారం. ఇందులో ప్రత్యక్షంగా సృష్టికర్త ఎవడూ లేకపోయినా డార్విన్‌ చెప్పిన జీవపరిణామం "గుడ్డి"గా ఇదే మార్గాన్ని అనుసరిస్తుంది. ఏ "ఉద్దేశమూ" లేకుండా జీవపరిణామం వీలున్నంత సులువుగా ముందుకు సాగాలంటే ప్రాణులు కొంతకాలానికి చచ్చిపోవడమూ, వాటి స్థానంలో వాటి జన్యులక్షణాలను కొనసాగించగలిగిన కొత్తవి పుట్టుకురావడమే "తేలిక". దీన్నర్థం చేసుకుంటే ప్రకృతిలో ముసలితనమూ, చావూ ఎందుకు ఉన్నాయో తెలుస్తుంది. నాశనం కాకుండా ఎల్లకాలమూ నిలిచేది ఆత్మకాదు; మన డీఎన్‌ఏ. చావును ప్రకృతి 'ఎంపిక' చేసిందంటే అందుకు ముఖ్యమైన కారణం సంతానోత్పత్తిలో జన్యువైవిధ్యం సాధ్యమవుతుందనే. ఏ ప్రాణి ఐనా తన శరీరలక్షణాలను ప్రతికూల వాతావరణానికి తగినట్టుగా మార్చుకోలేదు గనక అటువంటి మార్పు దాని సంతానంలో తప్ప జరగడానికి లేదు. జీవపరిణామపు పోటీలో విజయం సాధించాలంటే 'పాత' జీవాలు చావడం, కొద్దిపాటి మార్పులతో కొత్త ప్రాణులు పుడుతూ ఉండడం తప్ప గత్యంతరం లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా కాకపోయినా 'అంతిమవిజయం' పొందిన ఏర్పాటు కనక చావు అనేది డీఎన్ఏ వైవిధ్యానికీ, అది రకరకాల పరిస్థితుల్లో కొనసాగడానికీ దోహదపడింది. ఏ తరానికాతరం చచ్చిపోయి, కొత్త తరాలు పుట్టుకురావడమే ప్రాణుల 'సహజ' లక్షణంగా మిగిలిందనుకోవాలి.
మన వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపూ, ఆలోచనావేగం మందగించడం వగైరాలు మొదలౌతాయి. వీటిలో కొన్నిటికి కారణం థైరాయిడ్‌ లోపాలూ, కుటుంబసభ్యుల మరణం, నిద్రలేమి, అంటువ్యాధులూ, ఇతర మందుల దుష్ప్రభావాలూ మొదలైనవి ఏవైనా కావచ్చు. ఇవికాక శరీరంలోని ఇమ్యూన్‌ వ్యవస్థ వంటివి సరిగ్గా పనిచెయ్యకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యాధులు కలిగించే క్రిములనుంచి కాపాడగలిగిన ఇమ్యూన్‌ వ్యవస్థ వయస్సుతో బలహీనపడినప్పుడు అది శరీరంలో విడుదల చేసే ఏంటీబాడీలకు "తమ" పదార్థానికీ, బైటినుంచి ప్రవేశించిన "శత్రు" పదార్థాలకూ తేడాలు గుర్తించడం కష్టమౌతుంది. మామూలుగా వచ్చే రోగాలూ, ఒత్తిడులూ, పరిసరాల్లో కలిగే మార్పులూ ఇలా మొత్తంమీద అనేకరకాల కారణాలు ముసలితనానికి దారితీస్తాయి. ఇవేకాక యాదృచ్ఛికంగా జన్యువుల్లో కలిగే వినాశం చిన్న చిన్న తప్పులుగా మొదలై కొంతకాలానికి శరీరాన్ని పెద్దగా ప్రభావితం చేసే స్థితికి చేరుకుంటుంది.
ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం పెరిగిపోతోంది. దేవతల్లాగా ఎల్లకాలం యవ్వనులుగా బతకలేకపోయినా బతికిన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ముసలితనం మనని ఎలా శిథిలం చేస్తుందో తెలుసుకుంటే ఆరోగ్యానికి కీలకం తెలుసుకోవచ్చు. చాలామందికి ముసలితనంలో సమస్య శారీరక పటుత్వం తగ్గి, రోగాలూ రొష్టుల పాలవడమే కాదు. మెదడుకు సంబంధించిన రుగ్మతలుకూడా కొన్ని కలగవచ్చు. వీటిలో ముఖ్యమైనవి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, నరాల డీజెనరేటివ్‌ హీనసత్వ లక్షణాలవల్ల సంక్రమించే అల్జ్‌హైమర్స్‌ వ్యాధి, ప్రేరక నాడీకణాల మోటర్‌ న్యూరాన్‌ జబ్బులు, పార్కిన్సన్‌ వ్యాధి వగైరాలు. వయసు పైబడినప్పటికీ పూటగడవడానికో, ఇతర కారణాలవల్లనో వీరిలో కొందరైనా తమకూ సమాజానికీ పనికొచ్చే కొన్ని వృత్తులనూ, పనులనూ కొనసాగించక తప్పదు. అలాంటప్పుడు వీరిలో అనివార్యంగా కలిగే రుగ్మతలూ, అవసరమయే ప్రత్యేక సౌకర్యాలూ సమాజంపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి? వణుకుతున్న అవయవాలతో, మందగిస్తున్న చూపుతో ఎంతమంది అప్లికేషన్లో, మరో దరఖాస్తో చదివి, నింపి, చేత పట్టుకుని క్యూలలో నిలబడాలి? వీరిని సమాజం ఎంతవరకూ భరించి, ఆదరించి, పోషించగలుగుతుంది? వయసుమళ్ళినవారికి ఆశ్రమాలూ, ఇతర సదుపాయాలూ ఏర్పాటు చేసి నిర్వహించడం ఇప్పటికే ఒక పెద్ద పరిశ్రమగా రూపొందుతోంది. వీరి హక్కులనూ, అధికారాలనూ పరిరక్షించి, న్యాయ, సామాజికపరంగా కాపాడటానికి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి. కృషి చేస్తున్నాయి. వీటిని గురించి ప్రతివారూ పట్టించుకోక తప్పదు. ఎందుకంటే నేటి యువతీ యువకులే రేపటి వృద్ధులు!

ముసలితనం



గౌతమ బుద్ధుడుగా పేరుపొందని పిన్నవయసులో సిద్ధార్థుడు మొదటిసారిగా రోగగ్రస్తులనూ, ముసలివారినీ, శవాన్నీ చూసి చలించిపోయాడని అంటారు. ప్రతి ప్రాణికీ తప్పనిసరిగా వచ్చే ముసలితనం ఎవరికీ నచ్చని ఒక సహజ పరిణామం. చివరి ఘట్టమైన మృత్యువుకు మునుపటి దశ కాబట్టి అదంటే మనకు కాస్త భయం కూడా. మనకు పూర్తిగా అర్థం కానటువంటి తక్కిన విషయాలలాగే ముసలితనం అనేది కూడా ఎన్నో అపోహలకు గురి అవుతూ ఉంటుంది. దీన్ని గురించిన ఆధునిక పరిశోధనలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
మనం మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని రెండు రకాలుగా అర్థంచేసుకోవచ్చు. మొదటిది హేతువాద, భౌతికవాద పద్ధతి. రెండో పద్ధతిలో వేదాంత ధోరణీ, ఆధ్యాత్మిక వైఖరీ, మిథ్యావాదమూ మొదలైనవి ఎన్నయినా కలిసిపోయి ఉంటాయి. ఇక ఆ అయోమయంలో కళ్ళకు కనిపించే చరాచర ప్రపంచం గురించి ఎలాగయినా ఊహించుకోవచ్చు. ఈ ఊహలు నేలవిడిచిన సాములాగా ఉండకుండా, మనకు తెలిసినంతవరకూ ప్రకృతిని విజ్ఞానపరంగా అర్థం చేసుకోగలిగితే మనం కాస్త ప్రగతిని సాధించినట్టే. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా మానవసమాజం సాధించిన ప్రగతి ముఖ్యంగా విజ్ఞాన సముపార్జన మీద ఆధారపడినదే. ఈ అవగాహనలో ముసలితనాన్ని గురించిన భావనలు కూడా ఒక భాగమే.
మనుషులకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తమ ఉనికి. వీలున్నన్నాళ్ళు మంచి ఆరోగ్యంతో బతకడమే మనకు ప్రధానమైన విషయం. అందుకనే ఈనాటికీ ఎవరినైనా కలుసుకోగానే మొదట అప్రయత్నంగా "బాగున్నారా?" అని ఆడుగుతాం. కాని ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. ప్రకృతిలోని ప్రాణులన్నిటికీ వర్తించే ముసలితనం, చావు వగైరాల గురించి మనిషికి అనాదిగా తెలుసు. ఈ పరిణామదశలను అర్థం చేసుకోవడం మనిషికి సమాజ జీవితంలో సాధ్యమైంది. 50 వేల ఏళ్ళ క్రితమే నియాండర్తాల్ జాతి మానవులు శవాలను ఖననం చెయ్యడం మొదలుపెట్టారు. పుట్టుకనుంచి గిట్టేదాకా ఏమవుతుందో ఆదిమానవులు అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.


ఫ్రాన్స్ లోని 50 వేల ఏళ్ళనాటి నియాండర్తాల్ సమాధి
పుట్టినప్పుడు నిస్సహాయంగా ఉన్నప్పటికీ పసిపిల్లలు పెద్దయాక యుక్తవయస్సుకు చేరుకుంటారు. యవ్వనంలో శక్తినీ, బలాన్నీ, సంతానోత్పత్తికి సామర్య్థాన్నీ పొందుతారు. ఆ తరవాత అనుభవం, తెలివితేటలూ పెరుగుతాయి కాని శరీరం సడలిపోతుంది. నాగరికత మొదలైనప్పటినుంచీ మనవాళ్ళు నిత్యయవ్వనులుగా ఉంటే బాగుండునని కలలు కంటూనే ఉన్నారు. మన పురాణాల్లోని దేవతలు అమరులే కాదు. వారికి ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళే! ముసలితనంతో అమరులైతే మాత్రం లాభమేముంది? అందుకే మన దీవెనల్లో కూడా ఆయురారోగ్యాలు కలిసే ఉంటాయి.
శరీరంలో కలిగే రోగాలనూ, రొష్టులనూ పరిశీలించి తగిన చికిత్స చెయ్యడం ఏనాడో మొదలయింది. వీటిలో కొన్నయినా వార్థక్యాన్ని వాయిదా వేసే ప్రయత్నాల వంటివి. చరకుడూ, శుశ్రుతుడూ, బుద్ధుడి కాలంనాటి జీవకుడూ పేరుపొందారు. వీరంతా తమ కాలానికి సంబంధించినంత వరకూ "ఆధునిక" విజ్ఞానం సాధించినవారే. అందువల్ల మన దేశంలో మొదటినుంచీ వేదాంత ధోరణి మాత్రమే ఉండేదని వాదించేవారికి ఏమీ తెలియదనుకోవాలి. ఎందుకంటే భౌతికవాద, హేతువాద దృష్టి లేకుండా ఇటువంటి పరిశోధనలు చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. తరవాతి కాలంలో సూక్ష్మస్థాయిలో బాక్టీరియావంటి వాటివల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవడంలో వైద్య, శరీరశాస్త్రాలు ముఖ్యంగా పశ్చిమదేశాల్లో చాలా ప్రగతిని సాధించాయి.
మనిషి సగటు ఆయుష్షు కాలంతో బాటుగా పెరుగుతోంది. నియాండర్తాల్ దశలో 20 ఏళ్ళు బతికిన మానవులు ప్రాచీన గ్రీస్ నాగరికత నాటికి 28 ఏళ్ళూ, మధ్యయుగపు యూరప్ లో 33 ఏళ్ళూ బతికారు. 19వ శతాబ్దం అంతానికి 37కు మించని సగటు వయసు చికిత్సా పద్ధతుల్లోని అభివృద్ధి కారణంగా ఈ రోజుల్లో దాదాపుగా 70కి పెరిగింది. దీనివల్ల సమాజంలోనూ, జీవితం పట్ల మనుషుల దృక్పథంలోనూ కూడా ఎన్నో మార్పులు కలిగాయి. సగటు వయసునూ, జీవన ప్రమాణాలనూ కూడా మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయాయి. మరొకవంక ముసలితనానికి శాస్త్రీయ కారణా లెటువంటివో కూడా అవగాహనకు వస్తున్నాయి. తరవాతి వ్యాసంలో ఆ వివరాలు తెలుసుకుందాం.






మనిషి
సగటు ఆయుష్షులో పెరుగుదల



No comments:

Post a Comment