Sunday, September 13, 2009

ఆరు నెలలు ఆగాల్సిందే


పెళ్ళిళ్ళ కోసం తొందరపడేవారికి ఇది పిడుగులాంటి వార్తే. నవంబర్ 14 నుంచి సుమారు ఆరు నెలలపాటు సుముహూర్తమే లేదు. మే 15 వరకు వివాహం, గృహప్రవేశం వంటి ఎలాంటి శుభకార్యాలూ జరుపుకోకూడదు. అంటే నవంబర్ 10 నుంచి మే మూడో వారం వరకు బాజా భజంత్రీలు మూగపోవాల్సిందే! ఈ ఏడాది నవంబర్ 14 నుంచే మంచి ముహూర్తాలు లేవని చాలామంది పంచాంగ కర్తలు చెబుతున్నారు. ఒకటి రెండు పంచాంగాల్లో మాత్రం పరిమితంగా కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. గ్రహస్థితుల కారణంగా మంచి లగ్నాలు లేవని పంచాంగ కర్తలు అంటున్నారు. విదేశాల్లో... ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నవారికి డిసెంబర్‌లో క్రిస్మస్ సెలవులు వస్తాయి. ప్రవాస భారతీయులు సాధరణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే వివాహాది శుభకార్యాలు పెట్టుకుంటారు. ఎన్నారై సంబంధాలు చేసుకొనే వారికి, ముఖ్యమైన బంధువులు విదేశాల్లో ఉండే వారికి ఈ రెండు నెలలు ఎంతో అనుకూలం. ఈసారి ఈ రెండు నెలల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో వాళ్ళు డీలాపడిపోతున్నారు. అలా అని ఊరుకోకుండా పంచాంగాలన్నీ తిరగేసి తమకు అనుకూలంగా ఏదో ఒక ముహూబర్తానికి ఓకే చెబుతున్నారు. ఐదారు మాసాలు పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు లేకపోతే కోట్లాది రూపాయల వ్యాపారం ఏం కావాలి? అసలే ఆర్ధిక మాంద్యంతో వ్యాపారాలు సరిగా లేక తల్లడిల్లిపోతుంటే.. పులిమీద పుట్రలా ఇదేంటని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
రాష్ట్రంలోని కళ్యాణమంటపాల్లో ఏటా సుమారు 10 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక ఇళ్ళలో, గుళ్ళలో జరిగే వాటికి లెక్క లేదు. పెళ్ళిళ్ళ పేరిట మన రాష్ట్రంలో సుమారు 30 వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఓ అంచనా. ఆరు నెలల పాటు పెళ్ళిళ్ళు లేకపోతే ఈ వ్యాపారం అంతా ఏం కావాలి? దుస్తుల నుంచి బంగారు వస్తువుల వ్యాపారం వరకూ అన్నీ డీలా పడిపోవడం ఖాయమని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టువిడుపులు ప్రదర్శించి ముహూర్తాలు పెట్టేస్తే రాష్ట్రం కళకళలాడుతుంది కదా అని వ్యాపార వర్గాలు అంటుంటే... మౌఢ్యాలు, అధిక మాసాల్లో పెళ్ళిళ్ళు చేయలేం కదా అని పండితులు అంటున్నారు. ఇన్ని మాసాలు వివాహ ముహూర్తాలు లేకపోవడం చాలా ఇబ్బందికరం. ఇది పురోహితులకు గడ్డుకాలమే. పెళ్ళిళ్ళు లేకపోతే పురోహితుల ఆదాయంలో 60 శాతానికి పైగా గండి పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పురోహితులకు ఇది పెద్ద దెబ్బ. ఏదైనాగానీ పురోహితులనుంచి బంగారం వ్యాపారులవరకూ అందరికీ ఆర్ధికంగా చాలా దెబ్బ.

No comments:

Post a Comment