Thursday, September 24, 2009

మీ నెంబర్ మీకే


న్యూఢిల్లీ: 'టాటా నుంచి వొడాఫోన్ కు మారాను. ఇది నా కొత్త నెంబర్. సేవ్ చేసుకో!' ఈ తరహా కష్టాలకు అతి త్వరలో తెరపడనుంది. సర్వీస్ ఆపరేటర్ ను మార్చేసినా పాత సెల్ ఫోన్ నెంబర్ నే కొనసాగించుకునే అవకాశం డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి మెట్రో నగరాలు, సర్వీస్ 'ఏ' కేటగిరీ ప్రాంతాల సెల్ వినియోగదారులకు ఈ సౌలభ్యం లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి దేశ వ్యాప్తంగా 'మొబైల్ నంబర్ పోర్టబులిటీ' విధానం అమలులోకి వస్తుందని టెలికాం నియంత్రణ సంస్థ....ట్రాయ్ ప్రకటించింది. 'టెలీ కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం, 2009' ను విడుదల చేసింది. ఇందులో ఒక కనెక్షన్ యాక్టివేట్ అయిన 90 రోజుల తర్వాతే పోర్టబులిటీ అవకాశం లభిస్తుందని, అలాగే...ఒకసారి పోర్టబులిటీ సదుపాయం ఉపయోగించుకున్న తర్వాత కనీసం 90 రోజులపాటు అదే ఆపరేటర్ తో కొనసాగాలని, పోర్టబులిటీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకున్నట్లు కొత్త ఆపరేటర్ కు తెలియచేయాలని, పాతనెంబర్ తెలుపుతూ దానిని కొనసాగించాలని కోరాలని, పోర్టబులిటీ సదుపాయం ఉపయోగించుకునే వినియోగదారులు పాత ఆపరేటర్ కు బిల్లు మొత్తం బకాయి లేకుండా చెల్లించాలని, పోర్టబులిటీ రుసుమును ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. 'లోకల్ కాల్స్, ఎస్ ఎంఎస్ ల ప్యాకేజీ బాగుంది కానీ ఎస్ టీ డీ, ఐ ఎస్ డీ కాల్స్' చేయాలంటే మాత్రం తడిసి మోపెడవుతోంది. ఇలాంటి సమస్యలకు కూడా ట్రాయ్ ఓ పరిష్కారం కనుగొంది. మనం ఏ ఆపరేటర్ సేవలు పొందుతున్నా ఎస్ టీ డీ, ఐ ఎస్ డీ కాల్స్ కోసం మాత్రం మనకు నచ్చిన ఆపరేటర్ ను ఎంచుకోవచ్చు. దీనికోసం అందరు ఆపరేటర్లు పరిమిత కాలపు ఆఫర్ తో ప్రీపెయిడ్ కాలింగ్ కార్డ్స్ అందుబాటులోకి తేవాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్ కొత్త సిపారసు వల్ల ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగి కాల్ ఐ ఎస్ డీ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు.

No comments:

Post a Comment